Showing posts with label అమ్మ రాసిన కవితలు. Show all posts
Showing posts with label అమ్మ రాసిన కవితలు. Show all posts

Thursday, September 1, 2016

తరు సుభాషితం

Ficus benghalensis tree at IG Zoo park by Adityamadhav83/wikimedia commons

మర్రి, మోదుగ, రావి, కానుగచెట్లు
పలు లాభకరము, కాలుష్యహరము
పెనుగాలుల నాపు, పలుజీవులకు రక్ష
వాని నాటి పెంచు, భవిత హాయినుండ
                     
పొన్న, మద్ది, గంగరావి, తంగేడులు
జలమునాపి ఉంచు, కోతనణచు
పక్షి, జంతుతతిని ఆదరించును గాన
వాని నాటి పెంచు భవిత హాయి నుండ

జువ్వి, అశోక, మారేడు తరువులు
గాలి శుద్ధిచేయు, జలమునాపు
నీడనిచ్చు, శబ్ద కాలుష్య మడచును
వాని నాటి పెంచు, భవిత హాయి నుండ

వేప, తొగర,రేల,దిరిసెన, కుంకుడు
ఔషధములనిచ్చు, కరువునాపు,
త్వరగ పెరిగి పక్షిగూళ్ళను పెంచును
వాని నాటి పెంచు, భవిత హాయినుండ

జామ, చింత,ఉసిరి, మామిడి, పనసలు
వింతరుచుల నిచ్చు, కరివేపకూడ
నీడనిచ్చు, జీవవైవిధ్యమును పెంచు
వాని నాటి పెంచు, భవిత హాయినుండ

పొగడ, పొన్న, కదంబ, సంపంగి విరితరులు
పరిమళముల నింపు, కోతనణచి మించు
మెచ్చు రాగమిచ్చు, పిక, కీరములకును
వాని నాటి పెంచు, భవిత హాయి నుండ

నరకబోకు చెట్ల నరకమే మనకిక
మొక్క మచ్చిక చేయ మెచ్చు ప్రకృతి
తప్పును తుఫానులు తీర వృక్షములుండ
విత్తునాటి పెంచు జగతి నిండ

Wednesday, October 27, 2010

దేవుడిచ్చిన వరం

అంతులేని నీరున్నా ముత్యపు చిప్పకి
స్వాతి చినుకే దేవుడిచ్చిన వరం

ఆమని కొంగ్రొత్త చిగుళ్ళే
రాగాల కోకిలమ్మకి దేవుడిచ్చిన వరం

విత్తులు చల్లేందుకు కళ్ళలో
ఒత్తులేసుకుని చూచే రైతుకు తొలకరే దేవుడిచ్చిన వరం

పొద్దున్నే పృధ్విని తన పూలతో పూజించే
పారిజాతం పుడమి తల్లికి దేవుడిచ్చిన వరం

Monday, October 11, 2010

ప్లే క్లాసుల పంజరం..


అమ్మ ముద్దులు..
నాన్న మురిపాలు..
అమ్మమ్మ జోలలు..
నానమ్మ కథలు..
తాతయ్య గారాలు..
మామయ్య ముచ్చట్లు..

ఇవన్నీ వదిలి
ప్లే క్లాసుల పంజరంలో

నవ్వు, ఏడుపు,
నడక, ఆట, పాటలన్నీ బెదురుబెదురుగానే

అలసి సొలసి
బుజ్జి వయసులోనే మోయలేని భారం

ఏ గ్రేడుల పందేరం
వస్తే మోదం.. లేకుంటే ఖేదం..

అందమైన ఆప్యాయతల హరివిల్లు పై
ఊయలలూగాలని నీకున్నా, కుదరదే!!

Wednesday, October 6, 2010

అలసి సొలసిన అమ్మ!

వెన్నెల తరకల్ని మురిపించే నవ్వులతో

ఊ.. ఉంగా అంటూ చేతులాడిస్తూ

కోడికూత ముందే చిట్టి పాదాల్తో తంతూ

వటపత్రశాయిలా కాలివేలు చేత్తో పట్టి నోట పెట్టుకుంటూ

బోసినవ్వుల తేనెల విందు చేస్తూ రాగాలు తీసే కన్నా..

నీతో పాటే లేచి రాగాల ఊసులాడి

ఆనందామృతంలో తేలిపోవాలని ఉన్నా

ఈ నవయుగపు పందేరంలో

ఆఫీసుపనులూ, ఇంటిపనులూ, నీ పనులతో

అలసి సొలసిన అమ్మ

మగత నుండి తేరుకోలేదు, నీతో ఆడుకోలేదు .. కన్నా..

Sunday, April 11, 2010

చిరునవ్వుల వరద!... అమ్మ...

అక్షరాల కూర్పు
అందమైన కవితైనట్టు..
అనంత అమృత మధుర ధారావాహిని..
అమ్మ!

అరక్షణమైన ఏమరక
అనురాగాన్ని వర్షించేది..
అమ్మ!

అలంకారాలన్నిటినీ మించే
అపూర్వమైన చిరునవ్వుల వరద..
అమ్మ!

Monday, December 21, 2009

సాగరం..


ఎక్కడెక్కడో పర్వతాల్లొ పుట్టి
బుడి బుడి అడుగులతో
త్రోవలో తోటి వారిని కలుపుకొని
నవ్వుతూ పరవళ్ళు తొక్కుతూ
నడచిన త్రోవంతా నందనవనం చేస్తూ
తనకై వస్తున్న రాకుమారిని
అలల బాహువులతో ఆహ్వానించే
రాకుమారునిలా ఉంది సాగరం..


ఒకరి పొడ వేరొకరికి గిట్టకపోయినా
మొహాన చిరునవ్వు పులుముకున్న జనాలు,
కులమతాల రాగద్వేషాల చాందసభావాల
విప్లవాలు వినోదాలు కలగలిపిన
లౌకిక రాజ్యంలా ఉంది సాగరం..

Saturday, December 5, 2009

అలల తోరణం!

తెలి నురుగు తుంపరల కల్లాపి చల్లి
అరుణరాగరంజితముతో రంగవల్లులద్ది
తీరంతో పాటు అలల తోరణాలు కట్టి
ఎంతకల్లోలానైనా మనసులో దాచుకొని
పైకి హుందాగా బాలభానుడంత బొట్టుతో
వుండే నిండు ముత్తైదువలాంటిది సాగరం!

Thursday, December 3, 2009

అనిశ్చిత డోలిక...

మనసు! అనిశ్చిత డోలిక,
విరిసిన మంచుముత్యాల్లా ఆనందాన్నొలికిస్తుంది.

అట్టడుగు పొరల్నుంచి లావాలాంటి విషాదాన్నుబికిస్తుంది.
లాలిస్తుంది, ధైర్యాన్నిస్తుంది.నిన్ను నీ లాగ అద్దం పడుతుంది.


ఎవ్వరికీ తెలియకుందా ఏదైనా చేయగలనన్న నిన్ను,
తన కోర్టులో ముద్దాయిని చేస్తుంది.
తప్పించుకోలేక తపించే పశ్చాత్తాప శిక్ష వేస్తుంది.

అరక్షణంలో ప్రపంచాన్ని చుట్టేసి ఎంత ఆనందమోనంటుంది,
నాక్కావాలనగానే వికృత పరిణామం విశదం చేసేస్తుంది.

Tuesday, December 1, 2009

మీరేమంటారు?

జాబిలి కలువలు - రవి నీరజములు
ప్రకృతీ పురుషులు - సతీపతులు
అన్నదమ్ములు - అక్కచెల్లెళ్ళు
తాతామనవలు - తల్లిదండ్రులు

ఈ బంధాలన్నీ గొప్పవే అనాదిగా వస్తున్నవే..
మబ్బు వేస్తేనో, మాట పట్టింపుతోనో
దూరమయ్యేవేనేమో! కాసుతోనే ఊసేమో!

నిరంతరం ఆత్మీయతను వర్షించే
నిస్వార్థ స్నేహబంధమే అమృతమయమేమో!

దీనికి మీరేమంటారు?

Monday, November 30, 2009

విషాదం!


కలలకు కళ్ళెం పడితే విషాదం
కలకంఠిని కన్నీరు పెట్టిస్తే విషాదం

కన్న ప్రేమను కాదంటే విషాదం
కన్నె కన్నెర్ర చేస్తే విషాదం

కష్టాల పరీక్షలు గట్టెక్కక విషాదం
కడలి కల్లొలమైతే విషాదం

కరాళనృత్యం చేసే మృత్యుఘోష..
మహా విషాదం!

Saturday, November 28, 2009

పుస్తకం


తృష్ణార్తిని తీర్చే ఆనందాల కొలువు
అమృతాన్ని పంచే పలుకులమ్మ నెలవు
నిరుపేద విద్యార్ఠి పాలిట కల్పతరువు
ఎల్లవేళల తోడుండే మంచి చెలువు

ఆనంద "మేనా"



ఉత్సాహం ఉత్సుకత, ఊహ, ఉబలాటములనే బోయీలు మేనాని మోయగా
ఉరకలేసే ఆనందపు నవవధువు
సంబరాల పూబాటలో పయనిస్తూ
ఆశల వల్లికలను స్పృశిస్తూ
డోలాయమానమవుతున్న మేనాతో మనసును జత చేస్తూ
భావి సౌధానికి సాగుతోంది..  ఆనంద 'మేనా' ?
 

Tuesday, November 24, 2009

ఆదిత్య గమనం

సూర్యుని గమనానికి సరదాగా అన్వయించి రాసిన కవిత

ప్రత్యూష కిరణ మృదుభావ భాషిత - ఉదయాదిత్య!
మనోగత విషయాగత నిశిత పరిశీల - తరుణాదిత్య!
నిశ్చయగత ఆలోచనా నిగ్రహ - మధ్యాందినాదిత్య!
సాయం సమీర మనోల్లాస చిత్రాంకిత - సంధ్యాదిత్య!

Sunday, November 22, 2009

క్షణాల సమాహారం!


మనోవేగం ఆలొచన షడృచులతో విశ్వచుంబనం చేసే కాలం
పసిపాప చిరునవ్వులో తల్లి ప్రపంచాన్నే మరిచే కాలం
చెలియ రాకకై చెలికాడు యుగాలుగా నిరీక్షించే కాలం
ఒంటరిననుకునే మనిషికి తరగని ధీర్ఘ కాలం
జయాపజయాలు, సుదూర ప్రయాణాలు త్రుటిలో తప్పే కాలం
దండించిన బిడ్డను అక్కున చేర్చుకొవాలని తల్లి తపించే అనంత కాలం
లెక్కలేన్నని జీవులు జనించే, లయించే కాలం
ఒక్క నిమిషం, ఎన్నో క్షణాల సమాహారం!

Saturday, November 21, 2009

నవవసంతం


నవమల్లికా నికర మాలికల
మంజుల కూజిత స్వాగతాల
నవసమీర మృదుదరహాసాల
మధురాతిశయ మధుకరనిస్వనాల
కమల కోమల తరంగ కళాహారాల
నవ మంజీర లలితపద విన్యాసాల
మధురోహ జనిత శివానందాలాపనల
నవ వసంతమాగమించె ఆనందహేల

Friday, November 13, 2009

ఉత్తరాల జ్ఞాపకాలు!


ఉత్తరాలు, ఈ కాలంలో కనుమరుగైపోతున్నవి. కొంత రూపాంతరం చెంది sms మరియు E-mailsగా మారిపోయాయి.అయినా ఇంకా వాటి స్థానం మన గుండెల్లో పదిలం, అవి ఏ రూపం సంతరించుకున్నా కాని!

ఉత్తరాలు! సుదూర స్నేహ వృక్షాల నుంచి వీచే ప్రాణవాయువులు
ఉత్తరాలు! నిరంతర ఏకాంత బాటసారి మననం చేసుకునే జ్ఞాపకాలు
ఉత్తరాలు! ఎడబాటు నుండి ఆత్మీయ తీరాల వైపు సాగే ప్రయాణాలు
ఉత్తరాలు! ప్రతి మనసున పదిలముగా వుండే మధురమైన స్మృతులు.