Wednesday, October 27, 2010

దేవుడిచ్చిన వరం

అంతులేని నీరున్నా ముత్యపు చిప్పకి
స్వాతి చినుకే దేవుడిచ్చిన వరం

ఆమని కొంగ్రొత్త చిగుళ్ళే
రాగాల కోకిలమ్మకి దేవుడిచ్చిన వరం

విత్తులు చల్లేందుకు కళ్ళలో
ఒత్తులేసుకుని చూచే రైతుకు తొలకరే దేవుడిచ్చిన వరం

పొద్దున్నే పృధ్విని తన పూలతో పూజించే
పారిజాతం పుడమి తల్లికి దేవుడిచ్చిన వరం

Monday, October 11, 2010

ప్లే క్లాసుల పంజరం..


అమ్మ ముద్దులు..
నాన్న మురిపాలు..
అమ్మమ్మ జోలలు..
నానమ్మ కథలు..
తాతయ్య గారాలు..
మామయ్య ముచ్చట్లు..

ఇవన్నీ వదిలి
ప్లే క్లాసుల పంజరంలో

నవ్వు, ఏడుపు,
నడక, ఆట, పాటలన్నీ బెదురుబెదురుగానే

అలసి సొలసి
బుజ్జి వయసులోనే మోయలేని భారం

ఏ గ్రేడుల పందేరం
వస్తే మోదం.. లేకుంటే ఖేదం..

అందమైన ఆప్యాయతల హరివిల్లు పై
ఊయలలూగాలని నీకున్నా, కుదరదే!!

Wednesday, October 6, 2010

అలసి సొలసిన అమ్మ!

వెన్నెల తరకల్ని మురిపించే నవ్వులతో

ఊ.. ఉంగా అంటూ చేతులాడిస్తూ

కోడికూత ముందే చిట్టి పాదాల్తో తంతూ

వటపత్రశాయిలా కాలివేలు చేత్తో పట్టి నోట పెట్టుకుంటూ

బోసినవ్వుల తేనెల విందు చేస్తూ రాగాలు తీసే కన్నా..

నీతో పాటే లేచి రాగాల ఊసులాడి

ఆనందామృతంలో తేలిపోవాలని ఉన్నా

ఈ నవయుగపు పందేరంలో

ఆఫీసుపనులూ, ఇంటిపనులూ, నీ పనులతో

అలసి సొలసిన అమ్మ

మగత నుండి తేరుకోలేదు, నీతో ఆడుకోలేదు .. కన్నా..