Wednesday, December 30, 2009

బ్లాగులోకంలో మంచి టపాలు - 2009

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు. నేను బ్లాగులోకంలోకి వచ్చి కొంత కాలమే అయిన ఇక్కడ నాకు చాలా టపాలు (బ్లాగులు) నచ్చాయి, వాటిలోంచి నాకు బాగా నచ్చిన అందరు మెచ్చే విధముగా ఉండే 10 టపాలను ఇక్కడ పెడుతున్నాను.
బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు, ఈ టపాలు అందరికీ తెలియాలనే ఉద్దేశం తోనె పెడుతున్నాను. టపా పేరుపైన క్లిక్ చేస్తే వాటిని చూడచ్చు.


బుధవారం 19 ఆగస్టు 2009 న విశ్వ ప్రేమికుడు గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా నన్ను ఆలొచింపజేసింది, మంచి చర్చకు వేదికయింది.

Monday, November 30, 2009న పరిమళం గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా అద్భుతంగా ఉంది

MONDAY, JANUARY 5, 2009న ఆత్రేయ కొండూరు గారిచే పోస్ట్ చెయ్యబడిన
కవిత చాలా బాగుంది!

Feb 13, 2009న బుసాని పృథ్వీరాజు వర్మ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో వర్మ గారు గీసిన చిత్రం ఒక అద్భుతం,
ఆయన బ్లాగు నిజంగా "క ళా స్పూ ర్తి" నిస్తుంది

శుక్రవారం 18 డిసెంబర్ 2009న సంతోష్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా చాలా సరదాగా ఉంది.

గురువారం 12 నవంబర్ 2009న వెన్నెల గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో కవిత నాకు చాల బాగా నచ్చింది

September 1, 2009న అశ్విన్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పించింది

Tuesday, October 27, 2009న చిలమకూరు విజయమోహన్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా లో ఫోటో చాలా బాగుంది, పూలతో ఓంకారం

Monday, June 15, 2009న మహేష్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో కవిత భావయుక్తంగా కదిలించేలా ఉంది

Sunday, July 5, 2009న శివ చెరువు గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో కవిత చాలా చాలా బాగుంది!

నా ప్రయత్నానికి మీ మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ , ధన్యవాదములు :)

తెలుగు వారి సామెతలు - 2


1. మనిషి కాటుకి మందు లేదు

2. జింక కన్నిరు వేటగానికి ముద్దా!

3. తిండికి ముందు తగువుకి వెనుకకు

4. అతిరహస్యం బట్టబయలు అయినట్టు!

5. దూరపు కొండలు నునుపు

6. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు

7. ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు

8. అంచుడాబే కాని కోకడాబు లేదు

9. తలపాగా చుట్టడం రాక తల వంకరన్నట్టు!

10. కడుపు కూటికి ఏడిస్తే కొప్పు పూలకి ఏడ్చిందంట!

Monday, December 28, 2009

తులసి - సంజీవని

తులసి అనే చిన్న మొక్క సర్వరోగ నివారిణి.
భారత దేశంలో ప్రతీ దేవాలయ ఆవరణలో తులసి మొక్కకి ప్రత్యేక స్థానం ఉంటుంది.
తులసి శాస్త్రీయ నామము Ocimum sanctum (పవిత్రమైనది అని అర్థం) తులసి మొక్కలో అనేక రకాలు ఉన్నాయి, అలానె తులసికి మరికొన్ని పేర్లు ఉన్నయి వాటిలో కొన్ని
వ్రింద
విశ్వపూజిత
ఫుష్పసర
నందిని
కృష్ణజీవని
విశ్వపావని
మన పూర్వీకులు తులసికి అత్యంత ప్రాధన్యతను ఇచ్చారు. తులసిలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆయుర్వేద ఔషదాలలో తులసి ప్రముఖమైనది. తులసి జ్వరాన్ని నిరోధిస్తుంది, కోపాన్ని తగ్గిస్తుంది, చర్మరోగాలను నివారిస్తుంది, గొంతులో గరగరని పోగొడుతుంది.ఈగలు, దోమలను పారద్రోలే శక్తి తులసికి ఉంది.

తులసి విశిష్ఠతను నేడు ప్రపంచమంతా గుర్తిస్తున్నది. తులసి ఓజొను కారక శక్తిని విడుదల చేస్తుంది అని ఒక అధ్యయనంలో తెలిసింది. తులసి నుండి విడుదలయ్యే ప్రాణ వాయువు గుండె జబ్బులని నివారిస్తుంది. తులసి మహిలల ఆరొగ్యాన్ని కాపాడటానికి మరింత దోహదం చేస్తుంది. అందుకోసమే అనుకుంట మహిళలు తులసి పూజ చేసే ఆచారం ఏర్పాటయ్యింది.
తులసి గురించి మరిన్ని వివరాలకై ఈ క్రింది లింకులు చూడండి

Saturday, December 26, 2009

అందుకే అంత మాధుర్యం

అక్బరు చక్రవర్తి ఓ రోజు ఉదయం వాహ్యాలికీ బైలుదేరాడు, తనకి తెలీకుండానే చాలా దూరం సాగిపోయాడు. అంతలో ఒక చక్కని పాట అతని చెవినపడింది, మంత్రించినట్టు అలా నిలబడిపోయాడు. చుట్టూ చూసేసరికి దూరంగా ఒక హరిదాసు తన్మయుడై అర్థనిమిలిత నేత్రాలతో గానం చేస్తూ కనపడ్డాడు. అక్బరుకు చాల ఆశ్చర్యం కలిగింది, తను ఎప్పుడు అంత మధురమైన గానం వినలేదు.
రాజ భవనానికి చేరగానే తన ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ కు కబురు చేసి రప్పించి " మీరూ గొప్ప గాయకులే కదా , అంత కదిలించే పాట ఎప్పుడూ ఎందుకు పాడలేదు?" అని తను విన్న గానం గురించి చెప్పాక అడిగాడు అక్బరు. అప్పుడు తాన్ సేన్ నిట్టూర్చి " ఏముంది ప్రభూ నేను మిమ్మల్ని రంజింపచేయడానికి పాడతాను ఆ హరిదాసు భగవంతుని రంజింపచేయడానికి పాడుతున్నాడు, అందుకే అతని పాటకు అంత మాధుర్యం" అన్నాడు.

ఆగస్టు 2003 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Monday, December 21, 2009

సాగరం..


ఎక్కడెక్కడో పర్వతాల్లొ పుట్టి
బుడి బుడి అడుగులతో
త్రోవలో తోటి వారిని కలుపుకొని
నవ్వుతూ పరవళ్ళు తొక్కుతూ
నడచిన త్రోవంతా నందనవనం చేస్తూ
తనకై వస్తున్న రాకుమారిని
అలల బాహువులతో ఆహ్వానించే
రాకుమారునిలా ఉంది సాగరం..


ఒకరి పొడ వేరొకరికి గిట్టకపోయినా
మొహాన చిరునవ్వు పులుముకున్న జనాలు,
కులమతాల రాగద్వేషాల చాందసభావాల
విప్లవాలు వినోదాలు కలగలిపిన
లౌకిక రాజ్యంలా ఉంది సాగరం..

Saturday, December 19, 2009

తారక మంత్రం

రామ అనే రెండక్షరాలే తారక మంత్రం, ఆ రెండక్షరాలలోనే విశ్వరహస్యమంతా దాగుంది. సృష్టి స్థితి లయాలనే మూడింటికి ఉన్న సంబంధమే రామ శబ్ధం.

రామ శబ్ధంలోని "రా" లో "ర + ఆ" అనే అక్షరాలు ఉన్నాయి, ఇందులో "ర" అంటే అగ్ని, "ఆ" అంటె సూర్యుడు, "మ" అంటే చంద్రుడు. రామ శబ్ధంలో విశ్వానికి మూలమైన ఈ మూడు శక్తులు ఉన్నాయన్నమాట.

సూర్యుడు, భూమి, కాంతి, చలనము, విద్యుత్తు, ధ్వని, మేధస్సు, అగ్ని వలననే అవతరించాయని సామవేదంలో పేర్కొనబడినది.ఇక సూర్యుడి వల్లనే జ్ఞాన విజ్ఞానాలు లభిస్తున్నాయి, ప్రాణులకు చైతన్యం కలిగించేది సూర్యుడే. చంద్రుదు చల్లని వాడు, ఉష్ణొగ్రత తగినంత ఉండకపోతే ప్రాణులు జీవించలేవు, అందుకే చంద్రుడు లయానికి దోహదం చేస్తాడు. అందుకే రామ శబ్ధం తారక మంత్రమైంది, అందులో ఇంత విశెషముంది.

కుముదం 'భక్తి ' మాస పత్రిక (ఏప్రిల్ 2003) నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Friday, December 18, 2009

అమృతవాణి - I


చతుర్విధ పురుషార్థములు
"ధర్మార్థకామమోక్షాలు"

1. ధర్మము: ధర్మము ఆచరించాలి, మనం చేయగలిగిన దానిని సన్మార్గంలో చేయడమే ధర్మం.
జీవనానికి అవసరమైన ధర్మమార్గమున సంపాదించాలి

2. అర్థము: సన్మార్గమున అర్థవంతముగ జీవించాలి, కోరికలను విదిచిపెట్టాలి.

3. కామము: మోహమును జయించాలి అందుకు మనసున మంచి కోరికలు ఉండాలి.

4. మోక్షము: పైవన్ని చేసినపుదు మోక్షము లభిస్తుంది అని పెద్దల ఉవాచ.

ఈ నాలుగు మానవ జీవిత రధమునకు నాలుగు చక్రాలు.


కుముదం 'భక్తి ' మాస పత్రిక (ఏప్రిల్ 2007) నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Wednesday, December 16, 2009

అర్థం చేసుకోండి!

కొన్ని మంచి పుస్తకాలలోని కథలను ఈ కథా సుధ సంకలనం నందు పెడుతున్నాను, ఇవి ఒకదాని తర్వాత ఒకటి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనె వివిధ భాగాలుగా ప్రచురిస్తున్నాను.
ధన్యవాదములు

పూర్వం ఒక పండితుడు ఉండేవాడు.ఎంతటి క్లిష్టమైన గ్రంధాన్నైన తేలికగా అర్థమయ్యేలా వివరించే శక్తితో పాటు అతనికి మంచి మాటకారితనం కూడా ఉండేది, స్వదేశంలో గొప్ప ఐశ్వర్యం గడించినా ఆ పండితునికి ధనం పై ఆశ చావక పొరుగు రాజ్యానికి వెళ్ళి రాజాశ్రయం సంపాదించి రాజుగారికి భగవధ్గీతను బోదించడం ప్రారంబించాడు. ప్రతి రోజూ తన బోధన పూర్తయ్యాక "అర్థమైందా రాజా?" అని అడిగేవాడు. "ముందు మీరు అర్ఠం చేసుకుని చెప్పండి" అనేవాడు రాజు. ఇలా కొంత కాలం గడిచింది. రాజు ప్రతిరోజు అలాగే అంటుందేసరికి ఆ పండితునికి తన పాండిత్యం మీద తనకే అనుమానం కలగడం ప్రారంభించింది, తను సంపదించిన ఐశ్వర్యం చాలక మరింత ఐశ్వర్యం కోసం ప్రాకులాడుతున్నానని, భగవద్గీత బొదిస్తున్నది అది కానే కాదని అప్పుడతనికి స్పురించింది. "మహా రాజ మీ దయ వల్ల నాకు భగవద్గీత అర్థమైంది, ఇక సెలవు !" అని రాజుకు చెప్పి అక్కది నుంది స్వదేశానికి నిష్క్రమించాడు పండితుడు.

2002 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది ఈ కథ .

Tuesday, December 15, 2009

డబ్బు ఉన్నప్పటికీ పొందలేనివి!

'భక్తి ' సంకలనంలో కుముదం 'భక్తి ' మాస పత్రిక నుండి మా అమ్మకు నచ్చిన మరియు తను సేకరించిన విషయాలు పెడుతున్నాను.

డబ్బు సంపాదించవచ్చు.. నిద్రని సంపాదించలేము!

పుస్తకాల్ని కొనవచ్చు.. జ్ఞానాన్ని కొనలేము!

ఆహారాన్ని కొనవచ్చు.. ఆకలిని కొనలేము!

ఆడంబరాన్ని ప్రదర్సించవచ్చు.. ఆనందాన్ని కొనలేము!

మందులను కొనవచ్చు.. ఆరోగ్యాన్ని కొనలేము!

ఆయుధాల్ని కొనవచ్చు.. ధైర్యాన్ని కొనలేము!

పరిచయాలను పెంచుకొనవచ్చు.. ఆప్తమిత్రులను పొందలేము!

ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకొనవచ్చు..
కానీ మనశ్శాంతిని పొందలేము!

కుముదం 'భక్తి ' మాస పత్రిక (మార్చి 2003) నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Monday, December 7, 2009

ప్రేమ విశ్వజనీనం


ప్రేమే కల్పనైతే .. ఈ అనుబంధాలన్నీ శూన్యమే!
యువతీ యువకులు ప్రేమనుకునే ఆకర్షణ మాత్రమే కల్పన.

అవసరార్దం నటించే ప్రేమే కల్పన. నిజమైన ప్రేమ కల్పన కానేరదు.
శారదామాయిని జగజ్జననిగా భావించిన రామకృష్ణుడి భక్తి ప్రేమ కల్పనా?
కృష్ణునిలో ఆత్మసంధానం చేసిన మీరా ప్రేమ కల్పనా?

నిద్రాహారాలు మాని శ్రీ రాముని కొలిచిన సౌమిత్రి ప్రేమ కల్పనా?

తాను తినక పిల్లలకు పెట్టే పక్షి తల్లి ప్రేమ కల్పనా?

ఈ యాంత్రిక జీవనంలో ప్రేమలు కల్పనేనేమో అనే భ్రమ ఉదయిస్తుంది.

ఆత్మీయత లేని ప్రేమ కంట తది పెట్టిస్తుంది.
ప్రేమ లేని నాడు బ్రతుకే నిరర్దకం..
ప్రేమ విశ్వజనీనం.


ఈ మధ్య కొన్ని బ్లాగుల్లో వచిన "ప్రేమే కల్పనైతే" అనే దానిపై మా అమ్మ తెలిపిన అభిప్రాయం ఇక్కడ టపాలో పెడుతున్నను..

Saturday, December 5, 2009

అలల తోరణం!

తెలి నురుగు తుంపరల కల్లాపి చల్లి
అరుణరాగరంజితముతో రంగవల్లులద్ది
తీరంతో పాటు అలల తోరణాలు కట్టి
ఎంతకల్లోలానైనా మనసులో దాచుకొని
పైకి హుందాగా బాలభానుడంత బొట్టుతో
వుండే నిండు ముత్తైదువలాంటిది సాగరం!

Thursday, December 3, 2009

అనిశ్చిత డోలిక...

మనసు! అనిశ్చిత డోలిక,
విరిసిన మంచుముత్యాల్లా ఆనందాన్నొలికిస్తుంది.

అట్టడుగు పొరల్నుంచి లావాలాంటి విషాదాన్నుబికిస్తుంది.
లాలిస్తుంది, ధైర్యాన్నిస్తుంది.నిన్ను నీ లాగ అద్దం పడుతుంది.


ఎవ్వరికీ తెలియకుందా ఏదైనా చేయగలనన్న నిన్ను,
తన కోర్టులో ముద్దాయిని చేస్తుంది.
తప్పించుకోలేక తపించే పశ్చాత్తాప శిక్ష వేస్తుంది.

అరక్షణంలో ప్రపంచాన్ని చుట్టేసి ఎంత ఆనందమోనంటుంది,
నాక్కావాలనగానే వికృత పరిణామం విశదం చేసేస్తుంది.

Tuesday, December 1, 2009

మీరేమంటారు?

జాబిలి కలువలు - రవి నీరజములు
ప్రకృతీ పురుషులు - సతీపతులు
అన్నదమ్ములు - అక్కచెల్లెళ్ళు
తాతామనవలు - తల్లిదండ్రులు

ఈ బంధాలన్నీ గొప్పవే అనాదిగా వస్తున్నవే..
మబ్బు వేస్తేనో, మాట పట్టింపుతోనో
దూరమయ్యేవేనేమో! కాసుతోనే ఊసేమో!

నిరంతరం ఆత్మీయతను వర్షించే
నిస్వార్థ స్నేహబంధమే అమృతమయమేమో!

దీనికి మీరేమంటారు?