Monday, November 30, 2009

విషాదం!


కలలకు కళ్ళెం పడితే విషాదం
కలకంఠిని కన్నీరు పెట్టిస్తే విషాదం

కన్న ప్రేమను కాదంటే విషాదం
కన్నె కన్నెర్ర చేస్తే విషాదం

కష్టాల పరీక్షలు గట్టెక్కక విషాదం
కడలి కల్లొలమైతే విషాదం

కరాళనృత్యం చేసే మృత్యుఘోష..
మహా విషాదం!

Saturday, November 28, 2009

పుస్తకం


తృష్ణార్తిని తీర్చే ఆనందాల కొలువు
అమృతాన్ని పంచే పలుకులమ్మ నెలవు
నిరుపేద విద్యార్ఠి పాలిట కల్పతరువు
ఎల్లవేళల తోడుండే మంచి చెలువు

ఆనంద "మేనా"



ఉత్సాహం ఉత్సుకత, ఊహ, ఉబలాటములనే బోయీలు మేనాని మోయగా
ఉరకలేసే ఆనందపు నవవధువు
సంబరాల పూబాటలో పయనిస్తూ
ఆశల వల్లికలను స్పృశిస్తూ
డోలాయమానమవుతున్న మేనాతో మనసును జత చేస్తూ
భావి సౌధానికి సాగుతోంది..  ఆనంద 'మేనా' ?
 

Tuesday, November 24, 2009

ఆదిత్య గమనం

సూర్యుని గమనానికి సరదాగా అన్వయించి రాసిన కవిత

ప్రత్యూష కిరణ మృదుభావ భాషిత - ఉదయాదిత్య!
మనోగత విషయాగత నిశిత పరిశీల - తరుణాదిత్య!
నిశ్చయగత ఆలోచనా నిగ్రహ - మధ్యాందినాదిత్య!
సాయం సమీర మనోల్లాస చిత్రాంకిత - సంధ్యాదిత్య!

Sunday, November 22, 2009

క్షణాల సమాహారం!


మనోవేగం ఆలొచన షడృచులతో విశ్వచుంబనం చేసే కాలం
పసిపాప చిరునవ్వులో తల్లి ప్రపంచాన్నే మరిచే కాలం
చెలియ రాకకై చెలికాడు యుగాలుగా నిరీక్షించే కాలం
ఒంటరిననుకునే మనిషికి తరగని ధీర్ఘ కాలం
జయాపజయాలు, సుదూర ప్రయాణాలు త్రుటిలో తప్పే కాలం
దండించిన బిడ్డను అక్కున చేర్చుకొవాలని తల్లి తపించే అనంత కాలం
లెక్కలేన్నని జీవులు జనించే, లయించే కాలం
ఒక్క నిమిషం, ఎన్నో క్షణాల సమాహారం!

Saturday, November 21, 2009

నవవసంతం


నవమల్లికా నికర మాలికల
మంజుల కూజిత స్వాగతాల
నవసమీర మృదుదరహాసాల
మధురాతిశయ మధుకరనిస్వనాల
కమల కోమల తరంగ కళాహారాల
నవ మంజీర లలితపద విన్యాసాల
మధురోహ జనిత శివానందాలాపనల
నవ వసంతమాగమించె ఆనందహేల

Thursday, November 19, 2009

తెలుగు వారి సామెతలు - 1


1. కర్ర వంకర పొయ్యి తీరుస్తుంది!

2.గుమ్మం దాకా వచ్చి పరుగెత్తినట్లు!

3.పెసర మడిలో ఉంగరం పోతే పప్పు కుండలో వెతికాట్ట!

4.కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ!

5.అంగట్లో అరువు తల మీద బరువు!

6.కూర ఎంతైనా కూడు కాదు!

7.గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు!

8.కాశీకి పోయినా కర్మ తప్పదు.

9.నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు!

10.పండు ఆకుని చూచి పసర ఆకు నవ్వినట్టు!

Friday, November 13, 2009

ఉత్తరాల జ్ఞాపకాలు!


ఉత్తరాలు, ఈ కాలంలో కనుమరుగైపోతున్నవి. కొంత రూపాంతరం చెంది sms మరియు E-mailsగా మారిపోయాయి.అయినా ఇంకా వాటి స్థానం మన గుండెల్లో పదిలం, అవి ఏ రూపం సంతరించుకున్నా కాని!

ఉత్తరాలు! సుదూర స్నేహ వృక్షాల నుంచి వీచే ప్రాణవాయువులు
ఉత్తరాలు! నిరంతర ఏకాంత బాటసారి మననం చేసుకునే జ్ఞాపకాలు
ఉత్తరాలు! ఎడబాటు నుండి ఆత్మీయ తీరాల వైపు సాగే ప్రయాణాలు
ఉత్తరాలు! ప్రతి మనసున పదిలముగా వుండే మధురమైన స్మృతులు.

Tuesday, November 10, 2009

చల్లని తల్లి సీతమ్మ


చల్లని తల్లి సీతమ్మ.
మా అమ్మ సీతమ్మ బంగారమైన రచనలు, సేకరణలు, సంకలనాలు ఈ బ్లాగులో పెడుతున్నాను. మా అమ్మ రచనలు మిమ్మల్ని అలరిస్తాయి అని ఆశిస్తూ!

ఇట్లు
Monkey2man :)