Wednesday, October 27, 2010

దేవుడిచ్చిన వరం

అంతులేని నీరున్నా ముత్యపు చిప్పకి
స్వాతి చినుకే దేవుడిచ్చిన వరం

ఆమని కొంగ్రొత్త చిగుళ్ళే
రాగాల కోకిలమ్మకి దేవుడిచ్చిన వరం

విత్తులు చల్లేందుకు కళ్ళలో
ఒత్తులేసుకుని చూచే రైతుకు తొలకరే దేవుడిచ్చిన వరం

పొద్దున్నే పృధ్విని తన పూలతో పూజించే
పారిజాతం పుడమి తల్లికి దేవుడిచ్చిన వరం

Monday, October 11, 2010

ప్లే క్లాసుల పంజరం..


అమ్మ ముద్దులు..
నాన్న మురిపాలు..
అమ్మమ్మ జోలలు..
నానమ్మ కథలు..
తాతయ్య గారాలు..
మామయ్య ముచ్చట్లు..

ఇవన్నీ వదిలి
ప్లే క్లాసుల పంజరంలో

నవ్వు, ఏడుపు,
నడక, ఆట, పాటలన్నీ బెదురుబెదురుగానే

అలసి సొలసి
బుజ్జి వయసులోనే మోయలేని భారం

ఏ గ్రేడుల పందేరం
వస్తే మోదం.. లేకుంటే ఖేదం..

అందమైన ఆప్యాయతల హరివిల్లు పై
ఊయలలూగాలని నీకున్నా, కుదరదే!!

Wednesday, October 6, 2010

అలసి సొలసిన అమ్మ!

వెన్నెల తరకల్ని మురిపించే నవ్వులతో

ఊ.. ఉంగా అంటూ చేతులాడిస్తూ

కోడికూత ముందే చిట్టి పాదాల్తో తంతూ

వటపత్రశాయిలా కాలివేలు చేత్తో పట్టి నోట పెట్టుకుంటూ

బోసినవ్వుల తేనెల విందు చేస్తూ రాగాలు తీసే కన్నా..

నీతో పాటే లేచి రాగాల ఊసులాడి

ఆనందామృతంలో తేలిపోవాలని ఉన్నా

ఈ నవయుగపు పందేరంలో

ఆఫీసుపనులూ, ఇంటిపనులూ, నీ పనులతో

అలసి సొలసిన అమ్మ

మగత నుండి తేరుకోలేదు, నీతో ఆడుకోలేదు .. కన్నా..

Sunday, April 11, 2010

చిరునవ్వుల వరద!... అమ్మ...

అక్షరాల కూర్పు
అందమైన కవితైనట్టు..
అనంత అమృత మధుర ధారావాహిని..
అమ్మ!

అరక్షణమైన ఏమరక
అనురాగాన్ని వర్షించేది..
అమ్మ!

అలంకారాలన్నిటినీ మించే
అపూర్వమైన చిరునవ్వుల వరద..
అమ్మ!

Thursday, February 4, 2010

నాలుగు రకాల ప్రశ్నలు!

ప్రశ్నలు నాలుగు రకాలుగా ఉంటాయి, అవి:

1. ఏకాంశ వ్యాకరణీయం:
తడుముకోకుండా జవాబు ఇవ్వగలిగిన ప్రశ్న ఏకాంశ వ్యాకరణీయములు .

2. విభజ్య వ్యాకరణీయం:
విభాగము చేసుకొని జవాబు ఇవ్వవల్సిన ప్రశ్న విభజ్య వ్యాకరణీయములు.

3. పరిపృచ్చ్య వ్యాకరణీయం:
ప్రశ్నకు ప్రతి ప్రశ్న వేసి జవాబు ఇవ్వవలసినవి పరిపృచ్చ్య వ్యాకరణీయములు.

4. స్థాపనీయం:
బదులు ఏమీ చెప్పకుండా మౌనముగా ఉండవల్సిన ప్రశ్న స్థాపనీయము
లేదా అవ్యాకరణీయము.

బుద్ధుని "లోకక్షేమ గాధలు" అను పుస్తకము నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Wednesday, January 13, 2010

దేవుడెలా కనిపిస్తాడు?


"భగవంతుని దర్శించే మార్గం చెప్పండి స్వామీ " అని అడిగాడు ఒక శిష్యుడు గురువుగారిని.
గురువు అతణ్ని ఒక చెరువులోకి దింపి అతని తలను నీళ్ళలో అదిమి పెట్టి కాసేపు ఉంచాడు.
తర్వాత తల పైకి ఎత్తిన శిష్యుని "ఎలా ఉంది? " అని అడిగాడు.
" ఊపిరాడలేదు స్వామి, చనిపోతాననిపించింది. "అన్నాడు శిష్యుడు.
" నువ్వు ఊపిరి తీసుకోవడానికి ఎంత తపించావో, భగవంతుని దర్శనం కోసం అంత తపించు! అప్పుడు కనిపిస్తాడు " అన్నాడు గురువు.

జూలై 2003 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది. ధన్యవాదములు

Friday, January 8, 2010

శివలింగం విశిష్టత!

"లింగం" అనే మాటలో "లిం" అంటే ఈ ప్రపంచంలోని సకల చరాచర వస్తువులు లయమయ్యే స్థలం. "గం" అంటె, అలా లయమైన సకలజీవకోటి తిరిగి దాని నుండి ఉద్భవించడం.

బ్రహ్మ భాగం: లింగం కింది భాగం నాలుగు భుజాలు కలిగి ఉంటుంది.
విష్ణు భాగం: మధ్యభాగం ఎనిమిది భుజాలు కలిగి ఉంటుంది.అది పానవట్టం అనే పేటలో అమరి ఉంటుంది.

రుద్ర భాగం: పైన ఉండేది రుద్ర భాగం.

ఇలా శివలింగంలో త్రిమూర్తులు ఉంటారు, అందుకే శివలింగం ఎంతో విశిష్టమైనది.


కుముదం 'భక్తి ' మాస పత్రిక (డిసెంబర్ 2002) నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Wednesday, January 6, 2010

తమ దగ్గర ఉన్నదే ఇస్తారు!

జీసస్ కొందరితో కలసి ఒకసారి దారిన వెళుతుండగా కొంతమంది ఆయన గురించి చెడుగా చెప్పుకుంటుండడం వినిపించింది. జీసస్ ముఖంలో ఎటువంటి బాధా కనిపించలేదు. పైగా ప్రేమపూర్వక ధరహాసం చిందిస్తూ వారి గురించి తనతో ఉన్న వారితో కొన్ని మంచి మాటలు చెప్పారు.

జీసస్ వైఖరి వారికి అర్థంకాలేదు ."అదేమిటి ప్రభూ! వాళ్ళు మీ గురించి చెడ్డగా మాత్లాడుటుంటే మీరు వారి గురించి మంచిగా చెబుతారేమిటి?" అని ప్రశ్నించారు.
"దానికేముంది! ఎవరైనా తమ దగ్గర ఉన్నదే ఇతరులకి ఇస్తారు" అన్నారు జీసస్.

నవంబర్ 2002 సంవత్సరంలోని ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు

Tuesday, January 5, 2010

అందరికీ తెలియని అద్బుతమైన బ్లాగులు ..

మన బ్లాగులోకంలో కొందరికి మాత్రమే తెలిసిన అద్భుతమైన మంచి బ్లాగులు ఉన్నాయి, నేను తెలుసుకున్న కొన్నిటి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ టపాలో పెడుతున్నాను. బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు. వాటిని తప్పకుండా చూసి మీ అభిప్రాయం తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

బ్లాగు శీర్షిక:Colorful Moments of my (he)art...
"Art is God's exceptional gift in one's life and one should continue doing it." "కళ మనిషికి దేవుడిచ్చిన అరుదైన వరం. దాన్ని అనునిత్యం సాధన చేస్తూనే ఉండాలి." – Giridhar Pottepalem
బ్లాగు రచయిత: గిరిధర్

బ్లాగు శీర్షిక: అంతర్జాల బాలశిక్ష
నేటి తరం బాలలకు పాత తరం విషయాలు
బ్లాగు రచయిత: మైత్రేయి

బ్లాగు శీర్షిక:పెద్దలు చెప్పిన మంచి మాటలు ఉన్న నిజాన్ని పెద్దలు రక రకాలు గా చెప్పారు - వారి మాటల్లోనే కొంత ఈ బ్లాగు లో..
బ్లాగు రచయిత: ఫ్రసాద్

బ్లాగు శీర్షిక:రెప్పల వెనకాల. . . पलकों के पीछे నాలో! భావాలే తప్ప - బంధాలుండవు.భాధ్యతలే తప్ప - భారాలుండవు . అలంకారాలే తప్ప- అహంకారాలుండవు .స్పందనలే తప్ప- సాధింపులుండవు . పలుకులే తప్ప - పారవశ్యాలుండవు. మెరుగులే తప్ప - మెరుపులుండవు . ఊహలే తప్ప - ఉద్దేశ్యాలుండవు . నాలో నెను తప్ప - ఎవ్వరిలో ఉండను. -satya
బ్లాగు రచయిత: సత్య

బ్లాగు శీర్షిక: భద్రాచల నరసింహ
"నరహరి చరణము నమ్మిన వానికి నరక భయము లేదు ఎన్నటికి"
బ్లాగు రచయిత: శ్రీ భద్రాచల నరసింహ స్వామి సేవకులు