Thursday, September 1, 2016

తరు సుభాషితం

Ficus benghalensis tree at IG Zoo park by Adityamadhav83/wikimedia commons

మర్రి, మోదుగ, రావి, కానుగచెట్లు
పలు లాభకరము, కాలుష్యహరము
పెనుగాలుల నాపు, పలుజీవులకు రక్ష
వాని నాటి పెంచు, భవిత హాయినుండ
                     
పొన్న, మద్ది, గంగరావి, తంగేడులు
జలమునాపి ఉంచు, కోతనణచు
పక్షి, జంతుతతిని ఆదరించును గాన
వాని నాటి పెంచు భవిత హాయి నుండ

జువ్వి, అశోక, మారేడు తరువులు
గాలి శుద్ధిచేయు, జలమునాపు
నీడనిచ్చు, శబ్ద కాలుష్య మడచును
వాని నాటి పెంచు, భవిత హాయి నుండ

వేప, తొగర,రేల,దిరిసెన, కుంకుడు
ఔషధములనిచ్చు, కరువునాపు,
త్వరగ పెరిగి పక్షిగూళ్ళను పెంచును
వాని నాటి పెంచు, భవిత హాయినుండ

జామ, చింత,ఉసిరి, మామిడి, పనసలు
వింతరుచుల నిచ్చు, కరివేపకూడ
నీడనిచ్చు, జీవవైవిధ్యమును పెంచు
వాని నాటి పెంచు, భవిత హాయినుండ

పొగడ, పొన్న, కదంబ, సంపంగి విరితరులు
పరిమళముల నింపు, కోతనణచి మించు
మెచ్చు రాగమిచ్చు, పిక, కీరములకును
వాని నాటి పెంచు, భవిత హాయి నుండ

నరకబోకు చెట్ల నరకమే మనకిక
మొక్క మచ్చిక చేయ మెచ్చు ప్రకృతి
తప్పును తుఫానులు తీర వృక్షములుండ
విత్తునాటి పెంచు జగతి నిండ

Wednesday, August 31, 2016

ఆరోగ్యమైన ఆహరం తీసుకుందాం